విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబందుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే
निर्गुणस्य हतं रूपं दु:शीलस्य हतं कुलम्।
असिद्धस्य हता विद्या अभोगस्य हतं धनम् ।।
నిర్గుణస్య హతం రూపం దుఃశీలస్య హతం కులం
అసిద్ధస్య హతా విద్యా అభోగస్య హతం ధనం
ఈ సుభాషితము రకరకాల విషయాలు ఎలా ఎందుకు నశించిపోతాయో తెలియచేస్తుంది.
1. గుణం లేని రూపం
గుణహీనమైన రూపం ప్రాణం లేని శరీరంతో సమానం, అటువంటి శరీరం ఎంతో కాలం వుండదు.
2. దుశ్శీలస్య హతం కులం
చెరుకు తుద వెన్నుపుట్టిన చెరుకు తీపెల్ల చెరచు అన్నట్లు ఒక్క దుశ్శీలవంతుడి వలన అతని వంశం మొత్తం నాశనం అవుతుంది
3. అసిద్ధస్య హతా విద్యా
విద్య వలన మనకు అష్ఠసిద్ధులు లభిస్తాయి. విద్యకు పరమార్దం కైవల్యం మోక్షం. అటువంటి సిద్ధులు నేర్పలేని కైవల్యపదాని దారి చూపలేని విద్య నాశనం అయిపోతుంది మరచిపోతాము.
4. అభోగస్య ధనం
దాన ధర్మాలు చేయకుండా ఎటువంటి భోగమనుభవించకుండా దాచిపెట్టిన ధనం చివరకు దొంగలపాలు అయి నశిస్తుంది.
गणाणाम् त्वा गणपतिग्ं हवामहे
कविं कवीनां उपमश्रवस्तवम्
ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्पत
आनः श्शृण्वन्नूतिभि सीद सादनम्
గణానామ్ త్వా గణపతిగ్‍ం హవామహే
కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద సాదనమ్
గణాలలో నీవు గణపతివి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. హవిస్సులర్పిస్తున్నాను. కవులలో కవి వి (మహాభారతం రచించినవాడివి) అందరిలో పోల్చవలసిన కీర్తిశ్రేష్ఠులలో కూడా నీవే శ్రేష్ఠుడవు. రాజులకు జ్యేష్ఠుడవు, బ్రాహ్మణులలో గొప్ప బ్రాహ్మణుడవు. వచ్చి సుఖాసనంలో కూర్చుని మా కోరికలు వినుము.
प्रजानामेव भुत्यर्ध्यं स ताभ्यो बलिमग्रहीत।
सहस्र गुण मत्स्रुष्टुमादत्तेहि रसं रविः।।
ప్రజానామేవ భుత్యర్ధం స తాభ్యో బలిమగ్రహీత్
సహస్ర గుణ మత్స్రుష్టుమాదత్తేహి రసం రవిః
ప్రజావృద్ధి కార్యములకోసమే దిలీపుడు ప్రజల వద్దనుండి బలిమగ్రహీత్ అంటే పన్ను (1/6 వంతు) వసూలు చేసేవాడు. సూర్యుడు తిరిగి వేయిరెట్లుగా వర్షించటానికే కదా నదీ సాగరాలనుంచి రసం అంటే నీటిని ఆవిరి గా మార్చి గ్రహించేది.
ఇది మహాకవి కాళిదాసు రఘు వంశం కావ్యం లోనిది. ఇక్కడ రాజు పన్ను ఎంత వసూలు చేయాలో కూడా చెప్పారు. మన నిత్యజీవితంలో అవసరాలకు కమ్మరి కుమ్మరి చాకలి వడ్రంగి మొదలైన వారితో అక్కడే క్రయవిక్రయాలు నిర్వహణ జరిగిపోతుంది. బ్రాహ్మణులు, సైనికులు వారి అవసరాలకు క్రయవిక్రయాలు చేయలేరు చేయకూడదు. అటువంటి వారి సుఖసంతోషాలు రాజు బాధ్యత. అదే కాక రాహదారుల నిర్వహణ మొదలైన అంశాలన్నీ ఈ పన్నులోనుంచే వినియోగించాలి. ఇప్పటి పన్ను విధానాలు మారిపోయాయి తమ జేబులు నింపుకోవటం కోసం పన్ను వసూలు ధర్మ మార్గం కాదు.
वित्तेन रक्ष्यते धर्मो विद्या योगेन रक्ष्यते
मृदुना रक्ष्यते भूपः सत्स्त्रिया रक्ष्यते गृहम्
విత్తేన రక్ష్యతే ధర్మో విద్యా యోగేన రక్ష్యతే
మృదూనా రక్ష్యతే భూపః సస్త్రీయా రక్ష్యతే గృహమ్
విత్తం అంటే ధనం. ధనం వలన ధర్మం రక్షించ బడుతుంది, అంటే ధనం లేని చోట ధర్మం రక్షణ జరగదు. ఆ ధర్మ రక్షణార్ధమే ప్రభుత్వము పన్ను వసూలు చేయాలి. యోగము అంటే ధ్యానము, కేవలం ధ్యానము వలనే మనకు లభించిన ఙానం రక్షింపబడుతుంది, లేకపోతే కాలగమనంలో మరచి తిరిగి అఙానాంధకారంలోకి వెళ్ళి పోతాము. రాజు తన మృదుత్వం వలన ప్రజలకు చేరువయి రక్షించబడతాడు. చివరగా సస్త్రీ అంటే మంచి ఇల్లాలి వలన ఇల్లు రక్షింపబడుతుంది.
धर्मोपार्जित जिवितानां शास्त्रेषु झानेषु सदा रतानां
जितेंद्रियाणामतिथि प्रियाणां गृहेषु मोक्षः पुरुषोत्तमानां.
ధర్మో పార్జిత జీవితానాం
శాస్త్రేషు జ్ఞానేషు సదా రతానాం
జితేంద్రియాణా మథితి ప్రియాణం
గృహేషు మోక్షః పురుషోత్త మానాం
మోక్షం ఎటువంటివారికి వస్తుందో ఈ శ్లోకం చెప్తుంది.
ధర్మ మార్గమున జీవయాత్ర సాగిస్తూ, నిరంతరమూ జ్ఞానము,శాస్త్రములు అధ్యయనంచేస్తూ ఆనందించేవాడు, ఇంద్రియ లౌల్యానికి లొంగకుండా వాటిని తన వశంలో వుంచుకున్నవాడు, అతిథులకి అత్యంత ప్రియముతో గౌరవ మర్యాదలు చేసేవాడు అయిన ఉత్తముడికి గృహస్తాశ్రమములో ఉన్నాకూడా మోక్షము లభిస్తుంది. మోక్షం సాధించాలంటే సన్యసించి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. స్వధర్మ నిర్వహణతో మోక్షం లభిస్తుంది.