Wednesday, November 11, 2015

अजरामरवत्प्राज्ञो विद्यामर्थ च साधयेत् ।
गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥ 

అజరామరవత్ప్రాఙో విద్యామర్థ చ సాధయేత్
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్


ప్రాఙులు తమను తాము అజరామరులు అన్నట్లు విద్యార్జన, ధనార్జన నిరంతరం చేస్తూనే వుంటారు. అదే ధర్మాచరణ విషయానికొస్తే వెంట్రుకవాసిలో  మృత్యువు వుంటే ఎలా వుంటారో అంత జాగ్రత్తగా ధర్మాచరణ చేస్తారట.

Tuesday, November 10, 2015

पुस्तकेषु च या विद्या परहस्ते च यत् धनम। 
समये तु परिप्राप्ते न सा विद्या न तत् धनम।। 

పుస్తకేషు చ యా విద్యా పరహస్తే చ యత్ ధనం ।
సమయే తు పరిప్రాప్తే న సా విద్యా న తత్ ధనం ।।

పుస్తక పరిమితమైన జ్ఞానం, పరహస్తమైన ధనం వలన ఉపయోగం శూన్యం. ఇక్కడ సుభాషిత కారుని అభిప్రాయం పుస్తకాల నుండి పొందిన జ్ఞానాన్ని అవసరమైనప్పుడు ఆచరణలోనికి తీసుకురాకపోయినా మరియు ఇతరుల అవసరానికి ఇచ్చిన ధనం మన అవసరానికి తిరిగి ఇవ్వకపోయినా అటువంటి సంపద నిరుపయోగం.

Saturday, November 7, 2015

सत्यम ब्रूयात प्रियं ब्रूयात न ब्रूयात सत्यम अप्रियम
प्रियंच नानृतम ब्रूयात एषा धर्मः सनातनः

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం 
ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మః సనాతనః

శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణునికి సత్యాన్ని ఏ విధంగా చెప్పాలో పై శ్లోకం ద్వారా వివరించడం జరిగింది. 

సత్యాన్ని చెప్పడం మన ధర్మం, కాని అది తప్పక ఎదుటివారికి ప్రియంగా ఉండాలి. అప్రియమైన సత్యాన్ని వచించకపోవడం ఉత్తమం. మరియు ఎదుటి వారికి ప్రియమైనను అసత్యాన్ని చెప్పకూడదు. ఇదే సనాతన ధర్మంలో మోక్ష మార్గానికి దారి.

Tuesday, November 3, 2015

धर्मो जयति नाधर्मः सत्यं जयति नानृतं
क्षमा जयति न क्रोधो  विष्णुर्जयति नासुरः

“ధర్మో జయతి నాధర్మః సత్యం జయతి నానృతం 
క్షమా జయతి న క్రోధో విష్ణుర్జయతి నాసురః "

“ధర్మమే జయిస్తుంది, అధర్మం కాదు. సత్యం జయిస్తుంది, అసత్యం కాదు. క్షమ జయిస్తుంది, క్రోధం కాదు, విష్ణువు జయిస్తాడు, రాక్షసుడు కాదు " అని ఈ శ్లోకానికి భావం.
“సత్యం వద, ధర్మం చర"అనే ఆదర్శాన్ని ఉపనిషద్వాణి మనకు అందించింది. భారతీయ పురాణేతి హాసాలలో ఈ ఆదర్శంకోసం నిలబడి తరించిన మహనీయుల చరిత్రలు మనకు సుపరిచితాలు. శ్రీరాముణ్ణి మారీచుడు “రామో విగ్రహవాన్ ధర్మః" అన్నాడు. రాముని ధర్మాచరణదీక్ష అమోఘ మైనది. దైవం ధర్మ స్వరూపుడు, ధర్మ ప్రియుడు. అందుకే-ధర్మగ్లాని సంభవించినపుడు“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే"అన్నాడు భగవద్గీతలో. దైవ బలం కలది కనుక ఎప్పడూ ధర్మమే జయిస్తుంది . అధర్మం జయించదు . “యతో ధర్మస్తతో జయః "( ధర్మమెక్కడో జయం  అక్కడ) అనేది భారతసందేశం.

“సత్యమేవ జయతే"అంటుంది ఆర్షవాణి. సత్యవ్రతం పాటించే వారు మహితాత్ములౌతారు. దీనికి గాంధీ మహాత్ముడే నిదర్శనం. మసిపూసి మారేడు కాయ చేసినట్టుగా కొందరు తమ స్వార్థంకోసం సత్యాన్ని దాచి పెట్టి, తాత్కాలిక విజయం సాధించినా అది శాశ్వతం కాదు

మనస్సులోని మాలిన్యాల వికృతరూపమే క్రోధం. కోపాన్ని జయించనిదే ఎంతటి తపస్సైనా పరిపూర్ణం కాదు. కోపస్వభావులుగా పురాణకథల్లో పేరుపడిన విశ్వామిత్రుడు, దుర్వాసుడు మొదలైనవారు చివరకు అవమానితులు కావటం, పశ్చాత్తాప పడటం జరిగింది. అందుకే క్షమాగుణం విజేతగా నిలుస్తుంది గానీ, కోపంమాత్రం విజయం సాధింపజాలదు.

భగవద్గీత - దైవీసంపత్తి,ఆసురీ సంపత్తి అని స్వభావాలను రెండు విధాలుగా వివరించింది.విష్ణుమూర్తి దైవీ సంపత్తికి ప్రతీక, అధర్మవర్తనులు ఆసురీ సంపత్తికి ప్రతీకలు. అందుకే ఏకాలంలోనైనా అసురులపై లోకత్రాతయైన విష్ణువే విజయం సాధిస్తాడు. లోక కంటకులైన అసురులు అపజయాన్నే పొందుతారు.